ప్రకృతికి, స్త్రీలకు అండగా ‘బహుజన బతుకమ్మ’

Поділитися
Вставка
  • Опубліковано 9 жов 2024
  • ప్రకృతికి, స్త్రీలకు అండగా ‘బహుజన బతుకమ్మ’
    తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో సాంస్కృతిక పతాక బహుజన బతకమ్మ 2024అక్టోబర్‌తో 15వ ఏడు లోనికి అడుగు పెట్టింది.
    తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో సాంస్కృతిక పతాకగా ఎగిరిన బహుజన బతకమ్మ 2024అక్టోబర్‌తో 15వ ఏడు లోనికి అడుగు పెట్టింది. ఈ ఏట సెప్టెంబర్‌ 27, 2024న ఉస్మానియాలో ప్రారంభమై అక్టోబర్‌ 10న ముగిసే బహుజన బతుకమ్మ స్త్రీలపై అత్యాచారాలను ఖండిస్తూ, పర్యావరణ విధ్వంసాన్ని నిరసిస్తూ ఒక ఉద్యమంలా జరగనుంది. అందుకే చైతన్యయుతమైన తెలంగాణ సమాజం వివక్ష నుండి స్త్రీలను, విధ్వంసం నుంచి ప్రకృతిని రక్షించుకోవడానికి సాగుతున్న బహుజన బతుకమ్మ ఉద్యమంలో భాగం కావాలని కోరుకుంటున్నాం. ఇప్పటికే 2010లోనే పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలనే అంశంతో మొదలై వనరుల విధ్వంసాన్ని, చెరువులు-కుంటలు కూల్చడాన్ని, ప్రకృతి వ్యవసాయాన్ని ఎత్తిపడుతూ వచ్చాం. ఈ ఏడు అత్యాచారాల నుంచి స్త్రీల ఆత్మరక్షణకై-పర్యావరణ పరిరక్షణలకై ఉద్యమంగా సాగుదామని పిలుపునిస్తున్నాం.
    ప్రకృతిని పార్వతి గానూ, స్త్రీ గాను సరిపోల్చడం మన దేశంలోని మెజారిటీ ప్రజల రివాజు. బతుకమ్మ కులమతాలకు ప్రజలు బతుకమ్మ ఉత్సవాల్లో ప్రధాన భాగస్వాములుగా ఉంటున్నారు. పునరుత్పత్తి, -పిల్లల పెంపకం, ఇంటి పనులతో పాటు, ఉత్పత్తి-సేవా రంగాల్లోనూ స్త్రీలు ప్రధాన భూమిక పోషిస్తున్నారు. అందుకే ప్రజలు స్త్రీలకు భూమికి ఉన్నంత ఓపిక, సహనం ఉందంటారు. అలాంటి స్త్రీలపై పితృస్వామ్య దోపిడీ, -వివక్షలకు పరాకాష్ఠగా అత్యాచారాలు-, హత్యాకాండ రోజురోజుకూ తీవ్రమవుతున్నది. దోపిడీ వర్గాలు ప్రకృతినీ కొల్లగొడుతూ, కాలుష్యం సృష్టిస్తూ భూమిని వేడెక్కిస్తున్నాయి. ప్రతి ఏటా ఏడతెగని వర్షాలకు, అదే సమయంలో కరువూకాటకాలకు కారణమవుతున్నారు. ఇలా ప్రకృతి విధ్వంసం, స్త్రీలపై అత్యాచారాలు దేశమంతా ఒకేసారి చుట్టుముట్టి జన జీవితాన్ని అతలాకుతుల చేస్తున్నాయి. కోల్‌కత్తాలోని ఆర్జీకార్‌ ప్రభుత్వ దావఖానలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన అఘాయిత్యం వ్యవస్థాగతంగా వేళ్ళూనుకుంటున్న మాఫియా సంస్కృతిని వెల్లడిస్తూ దేశమంతా మరొకసారి చర్చనీయాంశం చేస్తుంది. అందుకే వీటిపై ఉద్యమించడం తక్షణ అంశంగానే కాకుండా దీర్ఘకాలిక లక్ష్యం కావాల్సిన అవసరం ఉందని బహుజన బతుకమ్మ భావిస్తున్నది.
    ఒక సమాజాభివృద్ధికి కొలమానం ఆ సమాజం లోని స్త్రీల స్థితిగతుల ఆధారంగానే తెలుసుకోవచ్చని డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ పేర్కొన్నారు. కానీ స్త్రీ పురుష అసమానత్వం, పితృస్వామ్య పీడనలో మన దేశ మహిళలు అట్టడుగు స్థితిని ఎదుర్కొంటున్నారని ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) వెల్లడించింది. ప్రపంచ నోబెల్‌ బహుమతి గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్‌ రెండున్నర కోట్ల గర్భస్థ శిశువులు ఆడపిల్లలైన పాపానికి తల్లి కడుపులోనే చిదిమివేయబడుతున్నారని వెల్లడించారు. ఈ విషయంలో 134 దేశాలపై జరిగిన పరిశోధనల్లో మన దేశం 114వ స్థానంలో ఉందని, మనకంటే శ్రీలంక, బంగ్లాదేశ్‌, నేపాల్‌లు మెరుగైన స్థితిలో ఉన్నాయని వెల్లడించారు. 1901 లో 1,000 మంది పురుషులకు 985 మంది మహిళలుంటే, వంద సంవత్సరాల తర్వాత 2001లో అది 978కి పడిపోయింది. 2001 నుండి 2010 మధ్య దశాబ్ద కాలంలోనే అది 876కి దిగజారింది. ఆర్థిక అసమానతల గురించి చెప్పాలంటే మన రాష్ట్రంలో కోటీ పందోమ్మిది లక్షల మందికి భూములుంటే అందులో మహిళలు 9.12 శాతం మాత్రమేనంటున్నారు. కానీ అన్ని రంగాల్లో స్త్రీలు అభివృద్ధిలో దూసుకుపోతున్నారని భావిస్తున్న సమయంలో ఈ గణాంకాలు మనల్ని ఎంతగానో వణికిస్తున్నాయి.
    పోలీస్‌ స్టేషన్లలో నమోదైన కేసులు ఆధారంగా ఎన్‌సిఆర్‌బి వెల్లడించిన వివరాల ప్రకారం ప్రతిరోజు 77 మంది స్త్రీలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. షెడ్యూల్డ్‌ కులాలు-తెగలపై జరుగుతున్న కేసుల్లో 1989 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంలోని పలు సెక్షన్లు జత చేయాలనే పట్టింపే లేకుండా పోతున్నది. ఎందుకంటే తరచుగా ఇలాంటి నిమ్న కులాలు, జాతుల వారిని అన్ని నిబంధనలు ఉల్లంఘించి దొంగతనాలు కారణం చూపి పోలీసులు కూడా సులభంగా వేధిస్తుండడం, అది తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో మరణాల దాకా పోవడం మనం చూస్తూనే ఉన్నాం. రోజురోజుకు బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను నిరోధించడానికి 2012లో తెచ్చిన పోస్కో చట్టం ద్వారా 1,023 ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు ఏర్పర్చి త్వరితగతిన విచారణ పూర్తి చేయాలనుకున్నా, ఇప్పటికీ 597 కోర్టులు మాత్రమే పనిచేస్తున్నాయి. ఆన్‌లైన్‌ ఇన్వెస్టిగేషన్‌, ట్రాకింగ్‌ సిస్టమ్‌, ఫోరెన్సిక్‌ లాబరేటరీ, పాన్‌ ఇండియా హెల్ప్‌ లైన్‌, బాధితులకు వసతి గృహాలు, 33 శాతం ఆడ పోలీసుల నియామకం ఇలా ఏ ఒక్కటి ఆచరణ రూపం తీసుకోలేదు. నిర్భయ ఫండ్స్‌లో కేవలం 39శాతం నిధులే ఖర్చు పెట్టబడ్డాయని ఆరోపణలు ఉన్నాయి. ఏదో ఒక సంఘటన జరిగినప్పుడు గగ్గోలు పెట్టడం తప్ప విద్యాలయాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో, పంట పొలాల్లో, కుటుంబాల్లో వేధింపులు, కుటుంబ హింస లాంటి అంశాల్లో మన దేశ పరిస్థితి ఏమంత మెరుగ్గా లేదు.
    స్త్రీలపై నేరాల పెరుగుదలలో మద్యం, గంజాయి, మాదక ద్రవ్యాలు, బూతు మీడియా, సులభ పద్ధతుల్లో కొందరికే సమకూరుతున్న సంపద, క్లబ్బులు, పబ్బులు అన్నీ పాత్ర వహిస్తున్నాయి. పైగా స్త్రీలు అబలలు, విలాస వస్తువుల నే భూస్వామ్య-సామ్రాజ్యవాద విష సంస్కృతి వేళ్లూనుకొని ఇలాంటి దుర్మార్గాలన్నీ సర్వసాధారణమైపోయాయి.
    ముంచెత్తుతున్న వరదల్లో అత్యాచారాలు, అఘాయిత్యాల పాలవుతున్న స్త్రీల కన్నీళ్లు కలిసి పారుతున్న సమయంలో పకృతిని, స్త్రీలను కాపాడుకునే లక్ష్యంగా సాగుతున్న బహుజన బతుకమ్మ ఉద్యమంలో యావత్‌ తెలంగాణ సమాజం భాగం కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. లౌకిక-ప్రజాస్వామిక-విప్లవ శక్తులు ఈ ఉద్యమానికి అండగా నిలబడాలని కోరుతున్నాం.
    విమలక్క, ప్రొ. కె.లక్ష్మి
    బహుజన బతుకమ్మ నిర్వహణ కమిటీ

КОМЕНТАРІ • 1