జటాశంకర్ గుహ దేవాలయం

Поділитися
Вставка
  • Опубліковано 22 жов 2024
  • ఉత్తర భారతదేశంనందు అనేక ప్రషిద్ధ నిగూఢ శివాలయాలు ఉన్నాయి. అటువంటి పసిద్ధ నిగూఢ యాత్రాస్థలమైన జటాశంకర్ శివాలయం మధ్యప్రదేశ్‌లో నర్మదాపురం జిల్లా పచ్‌మర్హికి ఉత్తరంగా గుహనందుంది. జటాశంకర్ ధామ్ అనిపిలువబడు జటాశంకర్ ఆలయం స్థానికులు కైలాసపర్వతం పిమ్మట శివుని రెండవ నివాసంగా భావిస్తారు. జటాశంకర్ బండరాళ్ళుకల లోతైనలోయలో ఉంది. యాత్రికులు గుహను శివక్షేత్రంగా తలుస్తారు. జటఅంటే జుట్టు శంకర్ అనగాశివుడు. బండరాళ్ళు చిక్కుబడ్డ జుట్టుతో శివునిజడలవలె కనిపించడంవల్ల శివుణ్ణి జటాశంకర్ అని పిలుస్తారు. గుహలోరాళ్ళు సహజంగా ఏర్పడిన శివలింగాలుగా కనపడతాయి. ఈప్రాంతంలో రెండు చల్లని మరియు వేడినీటి చెరువులున్నాయి. గుహ ముఖద్వారం వందతలల శేషనాగువలెఉంటుంది. జటాశంకర్ ఖజురహో విమానాశ్రయం నుండి 63 కిమీ చత్తార్పూర్ రైల్వేస్టేషన్ 36 కి.మీ దూరంలో ఉన్నవి. ఖజురహో, చత్తార్పూర్ నుండి జటాశంకర్ టాక్సీలో చేరవచ్చు. భోపాల్ నుండి పచ్‌మర్హి సుమారు 200 కి.మీ మరియు చత్తార్పూర్ 330 కి.మీ దూరంలో. భోపాల్ నుండి బస్సు సౌకర్యం ఉంది.
    పురాణకథనం ప్రకారం భస్మాసురుడు పరమశివుని ప్రసన్నం చేసుకోవాలని కఠినతపస్సు చేయగా శివుడు ప్రసన్నుడై వరం ప్రసాదిస్తానని తెలిపినప్పుడు,భస్మాసురుడు తనచేయి తలపై ఉంచినవ్యక్తి బూడిదగా మారేవరం కోరాడు. శివుడు వరంఇవ్వగా, భస్మాసురుడు శివుని తలపై చేయి వేయాలని నిర్ణయించుకోగా భస్మాసురుని ఉద్దేశంగ్రహించి శివుడు పరుగెత్తడం ప్రారంభించాడు.శివుడు తప్పించుకుని చివరకు పచ్‌మర్హిలోని జటాశంకర్ యొక్క నిగూఢగుహకు చేరుకున్నాడు. పర్వతాలు మరియు బండరాళ్ల మధ్య విస్తరించిఉన్న మర్రిచెట్ల కొమ్మలు చూసి, శివుడు తనజడను విస్తరించగా జటాశంకర్ ఉనికిలోకి వచ్చింది. నేటికీ బండరాళ్ళు విలక్షణమైన నిర్మాణంతో జడవలే కనిపిస్తాయి. శివునిజుట్టు చక్కగా నిర్వచించబడి విస్మయానికి గురిచేస్తుంది. గుహలో పైకప్పునుండి కారుతున్ననీటిద్వారా ఏర్పడిన శేషనాగు వంటి రాతినిర్మాణపు నీడలో సహజసిద్ధమైన అద్భుతమైన శివలింగం కనిపిస్తుంది. శేషనాగును పోలిననిర్మాణం శివునిజడలు అనినమ్మకం జంబూ ద్వీపం ప్రవాహంగా గుప్త గంగా రూపంలో పిలువబడే గుహలోని జటాశంకర శివలింగంపై పడునీటి మూలం ఇప్పటికినీ తెలియలేదు. గుహలో సహజంగా ఏర్పడిన ఈ 108 శివలింగాలు ఉన్నాయి. పాము మరియు పులి పోలికలతోకూడా నిర్మాణాలు ఉన్నాయి.
    జటాశంకర్ ఆలయంఉన్న సత్పురాపర్వతం సమీపంలోని పచ్‌మర్హి మధ్యప్రదేశ్‌లో 2500 అడుగుల ఎత్తులోకల ఏకైక హిల్ స్టేషన్, బ్రిటిష్ పాలనలో కనుగొనబడిన పచ్‌మర్హి హిల్ స్టేషన్ కుటీరాలు, తాత్కాలిక భవనాలు నిర్మించ బడ్డ వేసవివిడిదిగా అభివృద్ధి చేయబడింది. జటాశంకర్ ఆలయంలో "నంది" నోటినుండి నీరు ప్రవహిస్తుంది. జలపాతంనుండి వచ్చేనీరు జంబూనదిగా మారుతుంది. పాచ్‌మర్హి కొండగుహలలో అనేక పవిత్రమైన శివాలయాలు ఉన్నాయి. గుహ పైభాగంలో శివుడు, పార్వతి విగ్రహాలు మరియు శివలింగాలు ఉన్నాయి. ఈకొండలలో ఔషధ విలువలు కలిగిన అరుదైన మూలికలచెట్లు ఉన్నాయి. మహాశివరాత్రినాడు ప్రజలు గుహలో శివలింగాలకు అభిషేకంకోసం జంబూనదినుండి నీళ్ళుతెస్తారు. ఈ ప్రదేశం పచ్చనివృక్షాలు, జలపాతాలు మరియు కొండరాళ్ళమధ్య రహస్యమైన శివలింగాలతో పవిత్రత ప్రశాంతతొ ఆకర్షిస్తుంది.
    చౌరాఘర్ మహాదేవ్ ఆలయం పచ్‌మర్హిలో కొండపై సముద్రమట్టంనుండి సుమారు నాలువేల అడుగుల ఎత్తులోఉన్న భక్తులు కొండశిఖరం మీదఉన్న ఆలయానికి పచ్‌మర్హినుండి మూడు పర్వతాలుదాటి తొమ్మిది కిలోమీటర్లు సుమారు మూడుగంటలు నడచి పదమూడు వందలమెట్లుఎక్కి చేరవలసి ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో అనేక సంవత్సరాల నుండి భక్తులు సమర్పించిన అనేక త్రిశూలాలతో ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. కొండపై ఉన్న ఆలయంనుండి చుట్టూఉన్న లోయలతో సూర్యోదయం అందంగా కనపడుతుంది. ఆలయానికి వెళ్లదలచుకొన్నవారు మంచినీరు తదితరములు తీసుకొని కొండప్రాంతం అవడడంవల్ల చేతికర్ర ఉపయోగించవలసి ఉంటుంది. వయస్సు పైబడినవారు, పిల్లలతో ఆలయానికి ప్రయాణించకపోవడం శ్రేయస్కరం.
    శివరాత్రిసమయంలో భక్తులు త్రిశూలాన్ని భుజాలపైమోస్తూ భక్తితో ఈకఠినమైన యాత్రచేస్తారు. పచ్‌మర్హిలో గ్రామస్తులు ఈఆచారం వందల సంవత్సరాలుగా కొనసాగుతోందని చెపుతారు. త్రిశూలాలలో సుమారు నూటఏభై కిలోలబరువు పదిహేను అడుగుల ఎత్తుకల త్రిశూలాలు కూడా ఉంటాయి. స్వామివారికి త్రిశూలాన్ని సమర్పించడం శుభప్రదమని భక్తులు తమ కోరికలు నెరవేరిన తర్వాత త్రిశూలాన్ని భక్తితో సమర్పించు కుంటారు.. ఛోటామహదేవ్ మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని పచ్‌మర్హినందు ప్రముఖ క్షేత్రమై ఛోటామహదేవ్ అనిపిలువబడు చౌరాఘర్ మహాదేవ్ ఆలయం సందర్శించ వలసిన ప్రదేశాలలో ఒకటి.
    పాండవగుహలు పేరుతో పచ్‌మర్హి పట్టణంలో ఐదు రాతి ఆలయాలు ఉన్నాయి. రెండువేల సంవత్సరములకు పూర్వపు గుహలలో బౌద్ధ సన్యాసులు నివసించారని అంటారు. జూదంలో ఓడి రాజ్యబహిష్కృతులై వనవాసం మరియు అజ్ఞాతవాస కాలంలో పాండవులు ఈగుహలలో ఆశ్రయం పొందారని స్థానికకధనం. పురాణకథనం ప్రకారం పాండవులలో ఒకరైన అర్జునుడు నాగరాజుకి సంగీతంనేర్పి పంచమర్హికి పదిహేను కిలోమీటర్ల దూరంలోని నాగద్వారిలో నివసించు నాగరాజు వాసుకి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. గుహలు ఆకర్షణీయంగా శిల్పాలు కలిగిఉంటాయి.
    పచ్‌మర్హి పట్టణంలో శ్రీరామ మందిరం ఉన్నది. శ్రీరాముడు లంకనందు రావణుని వధించి సీతాదేవిని విముక్తురాలిని చేయుటకు రామేశ్వరం వద్ద శ్రేలంకకు సముద్రముపై హనుమంత, సుగ్రీవాది వానరముల సహాయంతో సముద్రంలో బండరాళ్ళు వేయించి వారధి నిర్మించాడు. అప్పుడు వారధి నిర్మించుటకు ఉపయోగించిన తేలికై నీటిలో తేలియాడు సున్నపురాళ్లు ఇప్పటికినీ రామసేతు శిధిలములందు చూడవచ్చు. అటువంటి సున్నపురాయి తమిళనాడులోని రామేశ్వరంలోనే కాక పచ్‌మర్హి పట్టణం శ్రీరామమందిరంనందు చూడవచ్చు. వేసవి మరియు వర్షాకాలంలో పర్యాటకులు ఎక్కువమంది పచ్‌మర్హి దర్శిస్తారు. యునెస్కో వారిచే రక్షితప్రాంతంగా గుర్తింపబడిన పచ్‌మర్హి పట్టణం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రాముఖ్యంకల పర్యాటకకేంద్రం.

КОМЕНТАРІ •